Srisailam Hydroelectric Project: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం: మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయి?.. మళ్లీ దెబ్బతిన్న నాలుగో యూనిట్
మళ్లీ దెబ్బతిన్న నాలుగో యూనిట్
Srisailam Hydroelectric Project: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ మరోసారి పాడైపోయింది. 150 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌ను మరమ్మతు చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన కొన్ని గంటల్లోనే మళ్లీ ట్రిప్ అయి నిలిచిపోయింది. ఇలా పూర్తిగా దెబ్బతినడం ఇది రెండోసారి. కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉండగా, ప్రతి ఒక్కటి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలవు.
2020 ఆగస్టు 20న అగ్నిప్రమాదం కారణంగా ఈ యూనిట్ కాలిపోయింది. తర్వాత రూ.68 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టి 2022 ఆగస్టులో పూర్తి చేశారు. 2023 ఆగస్టు 15న ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. కానీ, కేవలం 80 గంటలు మాత్రమే పనిచేసి, వైండింగ్ కాలిపోవడంతో మొదటిసారి పాడైంది. జెన్‌కో జాప్యం చేయడంతో రెండేళ్ల తర్వాత ఈ నెల 2న మరమ్మతులు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి ఉత్పత్తి ప్రారంభించిన 10 గంటల్లోనే మళ్లీ దెబ్బతిన్నది.
ఐదేళ్లుగా రోజుకు 30 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జెన్‌కోకు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్‌లో డిమాండ్ పెరిగినప్పుడు ఒక్కో యూనిట్‌ను రూ.5 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. కానీ, శ్రీశైలంలో కేవలం రూ.2కే ఉత్పత్తి అవుతుంది. యూనిట్ సక్రమంగా నడవకపోవడంతో డిస్కంలపై ఆర్థిక భారం పడుతోంది.
మరమ్మతుల విషయంలో జెన్‌కో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. అగ్నిప్రమాదంలో 9 మంది మరణించినా, భారీ నష్టం జరిగినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. స్టేటర్, రొటవేటర్ మరమ్మతులను రెండు వేర్వేరు కంపెనీలకు రూ.14.90 కోట్లతో అప్పగించారు. సమన్వయం లేకపోవడంతో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలున్నాయి.
2022లో మరమ్మతుల తర్వాత స్టేటర్-రొటవేటర్ మధ్య గ్యాప్ ఎక్కువ కావడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. సమస్యపై అధ్యయనం చేయకుండానే 2024లో ఒకే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నాలుగేళ్లు సరిపోతాయని కేంద్ర మార్గదర్శకాలున్నాయి. కానీ, ఒక యూనిట్ మరమ్మతుకే ఐదేళ్లు పడుతుండటం ఆశ్చర్యకరం.
జెన్‌కో మరమ్మతు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసి బ్లాక్‌లిస్ట్ చేస్తామని హెచ్చరించింది. 29న నిపుణుల అధ్యయనం చేస్తామని కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాది వానాకాలం వరకు ఉత్పత్తి కష్టమే. రోజుకు రూ.60 లక్షల నష్టం తప్పదు. జెన్‌కో సీఎండీ హరీశ్‌ను అడిగితే, కంపెనీ 15 రోజుల్లో వివరాలు ఇస్తుందని తెలిపారు.