Symbols Engraved on Medaram Stone Slabs: మేడారం శిలాఫలకాలపై చెక్కిన చిహ్నాలు... ప్రతి ఒక్కటికీ విశిష్ట అర్థం!
ప్రతి ఒక్కటికీ విశిష్ట అర్థం!
Symbols Engraved on Medaram Stone Slabs: ఆదివాసీల కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర స్థలంలో ప్రభుత్వం పునరుద్ధరణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరో నూరేళ్ల పాటు చెక్కుచెదరని విధంగా గ్రానైట్ రాళ్లతో గద్దెలు, చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు నిర్మిస్తోంది. కోయ తెగ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఈ పనులు జరుగుతూనే, సమ్మక్క-సారక్కల చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి శిలలపై వివిధ చిహ్నాలు చెక్కిస్తోంది.
కోయల వద్ద లభ్యమైన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఏడు వేలకు పైగా శిల్పాలు, చిహ్నాలు చెక్కారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు వంటి ఇష్టదైవాలకు ప్రతీకలుగా పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి వంటి పశు-పక్ష్యాదులతో పాటు కోయల జీవన విధానం, గోత్రాలు, సంప్రదాయాలను సూచించే సూర్య-చంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ-నిలువు గీతలు స్తంభాలపై చోటు చేసుకున్నాయి.
అంతేకాదు, సమ్మక్క-సారక్కల వంశానికి చెందిన దాదాపు 250 కోయ గోత్రాల ఇంటి పేర్లు, వాటి మూలాలను కూడా శిలలపై చెక్కడం జరిగింది. దీంతో భావి తరాలు కోయల చరిత్రను సులభంగా తెలుసుకోగలుగుతారని ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న ఆర్కిటెక్టులు తెలిపారు.
ప్రతి చిహ్నానికీ ప్రత్యేక ప్రాధాన్యం...
18 దిక్కుల చిహ్నం: ప్రాచీన భారత భూభాగంలోని 18 దిక్కులను సూచిస్తుంది. ఉత్తర భారతంలో మూడో గోత్రం 36 రాజ్యాలు, దక్షిణంలో ఆరో గోత్రం బేరంబోయిన రాజు 18 రాజ్యాలు పాలించారని చరిత్ర చెబుతోంది.
నెలవంక, ఏనుగు: ఆరో గోత్రం బేరంబోయిన వంశానికి చెందిన నుదుటి బొట్టు. మూడు అడ్డగీతల మధ్య చుక్క. గోత్ర జంతువు ఏనుగు.
ఆదిశక్తి: కోయలు ప్రకృతి స్త్రీ రూపాన్ని దైవంగా ఆరాధిస్తారు. సమ్మక్క ఆదిశక్తి అవతారమని నమ్మకం.
పులి: సమ్మక్క తల్లి పులి రూపంలో ఉంటుందన్నది కోయల విశ్వాసం.
తూతకొమ్ము: వేల్పు పండగ, జాతరల్లో ఉపయోగించే పవిత్ర వాయిద్యం. దీని శబ్దం లేకుండా దేవతలు కొండ దిగిరారని చెబుతారు.
చక్రం: రాయి బండానీ వంశంలో బండి చక్రాన్ని కనుగొన్నారని, అందుకే వారి చిహ్నం.
రంభ పక్షి: సమ్మక్క అడవిలో రంభ పక్షి రూపంలో ఉంటుందని నమ్మకం.
నాగుపాము: సమ్మక్క చెల్లెలు నాగులమ్మ నాగు రూపంలో ఉందని విశ్వాసం.
ఎద్దు: వడ్డే గోత్రం మూగో గోత్రం నుదుటి బొట్టు – మూడు అడ్డగీతల మధ్య చుక్క.
ఖడ్గమృగం: నాలుగో గోత్రం సనపగాని వంశం చిహ్నం.
త్రిశూలం, ఒంటికొమ్ము దుప్పి: ఐదో గోత్రం రాయి బండానీ వంశం చిహ్నాలు.
సింహం: వడ్డే గోత్రాన్ని సూచిస్తుంది.
జింక: సారలమ్మ ఆరాధ్య దైవం.
సూర్య-చంద్రులు: సృష్టి నడిపే శక్తులను ప్రతిబింబిస్తాయి.
ఈ చిహ్నాల ద్వారా కోయ తెగల సుదీర్ఘ చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇవి చారిత్రక ఆధారాలుగా కనువిందు చేస్తున్నాయి.