TGSPDCL : విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సరఫరాకు చర్యలు చేపట్టండి

విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క;

Update: 2025-07-17 04:41 GMT
  •  2034 నాటికి ఇది 33,773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుంది
  • సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి

భవిష్యత్ లో ఏర్పడే విద్యుత్ డిమాండ్ ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీడీసీఎల్ లో విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత నాణ్యమైన కరెంట్ ను రెప్పపాటు కాలంకూడా అంతరాయం లేకుండా ప్రజలకు అందిస్తున్నాం అని చెప్పారు. గత ఏడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేయగా.. ఈ ఏడాది 18 మార్చిన 335.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం అని అన్నారు. గత ఏడాది 8 మార్చి 8న 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడగా.. ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సుమారు 2000 మెగావాట్ల అదనపు డిమాండ్ ఏర్పడినప్పటికీ రెప్పపాటు కాలం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయగలిగామని తెలిపారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ఏర్పడిన.. ఎక్కడా కోతలు లేకుండా ప్రజలకు నిరంతరం కరెంట్ ను అందించిన ఘనత ప్రజా ప్రభుత్వంకు చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 2024 నుంచి 9.8 శాతం చొప్పున పెరుగుతోందని.. 2034 నాటికి ఇది 33,773 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు విశ్లేషించినట్టు తెలిపారు. గ‌త ఐదేళ్లుగా రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాలో విద్యుత్ డిమాండ్ గ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ అవ‌స‌రాలు, అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఉప ముఖ్య‌మంత్రి సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా కొత్త స‌బ్ స్టేష‌న్ల‌ను నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశారు.

కొత్త స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్న ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే విష‌యంపై దృష్టి సారించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అధికారుల‌కు సూచ‌న చేశారు. ఇదిలా ఉండ‌గా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా పేరొందిన హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ ఎల‌క్ట్రిసిటీ కేబుల్స్ నిర్మాణం కొర‌కు పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 12.5 మిలియన్ యూనిట్ల ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్ యూనిట్ల పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీపై పూర్తిగా దృష్టి సారించాల‌ని అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ నవీన్ మిట్టల్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి హరీష్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News