Investments in Hyderabad: హైదరాబాద్‌లో పెట్టుబడులపై చర్చలు: సీఎం రేవంత్ రెడ్డి‌తో జర్మన్ ప్రతినిధి బృందం భేటీ.. చర్చించిన కీలక అంశాలు!

చర్చించిన కీలక అంశాలు!

Update: 2025-11-04 12:12 GMT

Investments in Hyderabad: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ నేతృత్వంలోని బృందం మంగళవారం భేటీ అయ్యింది. డ్యూయిట్ష్ బోర్స్ (Deutsche Borse) కంపెనీ తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు జర్మన్ బృందం సీఎంకు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, దీనికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

డ్యూయిట్ష్ బోర్స్ GCC సెంటర్ ద్వారా రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు జర్మన్ బృందం వివరించింది. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ బృందాన్ని కోరారు. రాష్ట్రంలో జర్మన్ భాషా టీచర్లను నియమించి, విద్యార్థులకు జర్మన్ భాషా శిక్షణ అందించేందుకు సహాయం చేయాలని కాన్సుల్ జనరల్‌ను కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ-జర్మనీల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.

ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ విషయాల్లో శిక్షణ కార్యక్రమాలకు సహకరించాలని జర్మన్ బృందాన్ని అభ్యర్థించారు. ఈ భేటీలో అమిత్ దేశాయ్, డ్యూయిట్ష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News