ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

పీసీఘోష్‌ కమిషన్‌ నివేదిక, బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం;

Update: 2025-08-26 07:32 GMT

వర్తమాన అంశాలపై చర్చించడానికి తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 30వ తేదీన ప్రత్యేక సమావేశం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఈ నెల 29వ తేదీన జరిగే తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా అవసరమైతే మూడు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీఘోష్‌ సమర్పించిన విచారణ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్ధల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ పీసీఘోష్‌కమిషన్‌ ఇచ్చిన విచారణ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై పీసీఘోష్‌ నివేదికపై చర్చే ప్రధాన ఎజెండాగా ఉండబోతోందని సమాచారం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్‌ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. వీరిద్దరు వేసిన పిటీషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పీసీఘోష్‌ కమీషన్‌ పై అసెంబ్లీలో జరగబోయే చర్చకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరు అవుతారా కారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News