Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశం: మంత్రుల వ్యవహార శైలిపై వాడీవేడి చర్చ!
మంత్రుల వ్యవహార శైలిపై వాడీవేడి చర్చ!
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రుల వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరిగింది. తాజా సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. గురువారం జరిగిన సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత అధికారులను బయటికి పంపి, మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నరం రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కొందరు మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరు, వ్యవహార శైలి, ఎక్సైజ్ శాఖ వివాదం, కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం వంటి అంశాలపై వివరంగా చర్చ చోటుచేసుకుంది. కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుపట్టిన ముఖ్యమంత్రి, వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు తప్పనిసరని హెచ్చరించారు.
వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ వీఆర్‌ఎస్‌పై జరిగిన ఘటనలో కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో తన కుటుంబ సభ్యులను లాగడానికి ప్రయత్నించారని మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలు వివరణ ఇచ్చారు. ఇద్దరూ తాము తొందరపడ్డామని, తప్పు ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనలపై గట్టిగా మాట్లాడి, మంత్రులుగా బాధ్యతలు గుర్తుచేశారు.
గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో కొండా సురేఖ తన కుమార్తె మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పారు. వివాదాలు సమసిపోయాయని పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావు కూడా రిజ్వీ వీఆర్‌ఎస్‌కు తన లేఖకు సంబంధం లేదని, కేటీఆర్ విమర్శలకు తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల్లో విజయానికి కృషి, బీసీ రిజర్వేషన్లపై కూడా ముఖ్యమంత్రి వివరంగా చర్చించారు.
ఈ చర్చలు మంత్రివర్గంలో క్రమశిక్షణ, ఐక్యతను బలోపేతం చేసేలా ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం లక్ష్యాల సాధనకు మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.