CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌తోపాటు కీలక నిర్ణయాలు
కీలక నిర్ణయాలు
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం (ఆగస్టు 14) జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం మూడు గంటలపాటు కొనసాగి ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 22-ఏ నిషేధిత భూములు, మెట్రో రైలు, సంక్షేమ పథకాల విస్తరణ, కొత్త లబ్ధిదారుల ఎంపిక, కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్ట్ పాలసీ, ఆహార కల్తీ వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. చట్టసభల్లో పోటీకి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసే విషయంతోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా సమాలోచనలు జరిగాయి.
సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
గ్లోబల్ సమ్మిట్ 2.0, స్మార్ట్ కార్డులు
గత ఏడాది కంటే ఘనంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ను ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీలు, ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు జరుగుతుంది. స్టార్టప్‌లు, పరిశ్రమల విజయాలు, కొత్త ఆవిష్కరణలపై ఎగ్జిబిషన్, స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో 2.81 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 62 లక్షల కార్డులు జారీ చేసి మొత్తం సంఖ్యను 3.42 కోట్లకు చేర్చింది.
ఇతర కీలక నిర్ణయాలు
వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, రైతులకు అవగాహన కల్పించాలని, గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి ఈ సన్నాలకు రూ.500 బోనస్ చెల్లించాలని తీర్మానించారు.
ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపారు.
ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని, ఇప్పటి వరకు 86కి అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం అమలుకు ఆమోదం. ఒక్కో ఆటోకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు.
హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేయాలని కన్సల్టెంట్ నియామకానికి కూడా ఆమోదం తెలిపారు.
ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య విద్యకు దోహదపడతాయని అధికారులు అంటున్నారు.