BC Reservations : బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ

ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు సిద్దమవతున్న రేవంత్ సర్కార్‌;

Update: 2025-07-29 04:00 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును వెంటనే ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్ననేపథ్యంలో ఆగస్ట్ 5వ తేదీన బీసీల రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు పార్లమెంట్ లో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించింది. ఆగస్ట్ 6వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరుసటి రోజు ఆగస్ట్ 7వ తేదీన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును అదే రోజున ఆమోదించింది. మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ, మార్చి 18న తెలంగాణ కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లులు మార్చి 22న రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. మార్చి 30వ తేదీ నాడు ఈ బిల్లులను రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయి.

బీసీల రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపై రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉంది. మూడు నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అందుకే బీసీల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గతంలో పదేండ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీసీలకు తీరని ద్రోహం చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారు. కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెపుతోంది. కేసీఆర్ బీసీలకు ద్రోహం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జులై10వ తేదీన జరిగిన కేబినేట్ మీటింగ్లో ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకురావాలని తీర్మానించింది. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్ను జులై 14వ తేదీన ప్రభుత్వం గవర్నర్ కి పంపించింది. ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదించాలని రాష్ట్ర కేబినేట్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News