BC Reservations : బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణ రాజకీయాలు
క్రెడిట్ తీసుకోవడానికి పోటీలు పడుతున్న నేతలు;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముహుర్తాన స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి సీయం రేవంత్ రెడ్డి పరిషత్, పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు పెద్దగా స్పందిచకపోయినా… వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన రాజకీయ శక్తులుగా ఎదగాలనుకుంటున్న రాజకీయ నాయకులు ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ప్రారంభించారు. ఈ విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీ నాయకత్వానికి ధిక్కార స్వరం వినిపిస్తూ సమాతరంగా బీసీ జేఏసీని నడుపుతున్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నలు ప్రధానంగా ముందు వరుసలో నిలబడ్డారు.
సీయం రేవంత్ రెడ్డి స్థానిక సంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆమె అనుచరులు గులాల్ చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. అంతకు కొన్ని రోజులు ముందుగానే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కల్వకుంట్ల కవి ఒక ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర స్ధాయిలో అన్ని బీసీ సంఘాలను కలుపుకుని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడానికి జాతీయ స్ధాయిలో ఉద్యమాలు చేస్తామని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ శపథం పూనారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్థానిక సంస్దల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించగానే అది తన తొలి విజయంగా భావించి జాగృతి కార్యకర్తలతో కలసి సంబురాలు చేసుకున్నారు. అయితే బీసీల రిజర్వేషన్లు విషయంలో ఈ విధంగా కవిత చొచ్చుకుపోవడం ఆ జోనర్ పై గంపెడాశలు పెట్టుకున్న మల్లన్నకు రుచించలేదు. దీంతో అసలు కవితకేం సంబంధం అంటూ ఒకట్రెండు నాటు నుడికారాలను ప్రయోగించి బీసీలకు రిజర్వేషన్ల అమలు పట్ల ఆమె చేసుకున్న వేడుకలను తీసిపారేశారు.
అయితే కవితకేం సంబంధం అంటూ ఆమె ప్రమేయాన్ని తిరస్కరించిన సందర్భలో మల్లన్న చేసిన వ్యాఖ్యలు కవితతో పాటు జాగృతి కార్యకర్తలను కూడా తీవ్రంగా హర్ట్ చేశాయి. ఆ వెనువెంటనే తీన్మార్ మల్లన్న నడుపుతున్న క్యూ టీవీ కార్యాలయంపై దాడి చేసి మల్లన్నను కూడా కొట్టడానికి ప్రయత్నించారు. కానీ జాగృతి కార్యకర్తల ప్రయత్నాలను మల్లన్న గన్ మెన్లు అడ్డుకున్నారు. గాల్లోకి ఒక రౌండ్ కవిత అనుచరులపై మరో రౌండ్ పేల్చి ఘోరం జరగకుండా నిరోధించారు. అసలే బీసీ ఉద్యమాలతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రణాళికలు వేసుకున్న తీన్మార్ మల్లన్నకు పానకంలో పుడకలా కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకోవడం రుచించలేదు. పై పెచ్చు అసలు ప్రభుత్వం బీసీలకు ఇస్తానంటున్న 42 శాతం రిజర్వేషన్లపైనే మల్లన్నకు పేచీ ఉంది. అసలు తెలంగాణలో బీసీల సంఖ్య దగ్గర దగ్గర 60 శాతం ఉండగా, దాన్ని 42 శాతానికి రేవంత్ రెడ్డి సర్కార్ తగ్గించి చూపిస్తోందని సొంత పార్టీలోనే ముసలం పుట్టించాడు తీన్మార్ మల్లన్న. గతంలో రేవంత్ సర్కార్ చేయించిన కులగణన తాను ఒప్పకోవడం లేదని లైవ్‌లో ఆ డాక్యుమెంట్ ను చింపి పారేశాడు. వెనువెంటనే బీసీ జేఏసీని స్ధాపించి యుద్దం ప్రారంభించాడు. ఇలా ఇటుక ఇటుకా పేర్చుకుంటూ తెలంగాణలో బీసీలందరికీ నాయకుడిగా ఎదగాలని ప్రణాళికలు వేసుకుంటుంటే మధ్యలో కవిత బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని ప్రయత్నించడం మల్లన్నకు కోపం తెప్పించింది. దీంతో ఓ రెండు మాటలు విసిరాడు. దానికి కోపం తెచ్చుకున్న జాగృతి కార్యకర్తలు మల్లన్న టీవీ కార్యాలయంపై దాడి చేశారు.
ఇదంతా ఒకెత్తైతే వీరిద్దరి దూకుడు చూసి బీజేపీ, బీఆర్‌ఎస్ లు కూడా బీసీల తరపున వకాల్తా పుచ్చుకుని తాము కూడా బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగస్వాములు కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అకస్మాత్తుగా తెలంగాణలో ఇలా ప్రతి రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు తమపై ఇంతటి ప్రేమను ఒలకపోయడం చూసి బీసీలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఏది ఏమైనా 2028లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లే ప్రధానాంశంగా జరుగుతాయనేది జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది.