SIR Survey: SIR సర్వేకు తెలంగాణ సిద్ధం

తెలంగాణ సిద్ధం

Update: 2025-12-23 06:14 GMT

ముందస్తు సన్నాహాలు వేగవంతం

2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితా మ్యాపింగ్ ప్రక్రియ జోరు

SIR Survey: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కోసం తెలంగాణలో ముందస్తు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశలో తెలంగాణను కూడా ఎస్‌ఐఆర్‌లో చేర్చనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయి పనులను త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ సర్వే ఆధారంగా ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ జరుగుతోంది.

బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) పాత జాబితాలోని ఓటర్ల పేర్లను ప్రస్తుత జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా ఓటర్ల సంతానం వివరాలు సేకరించి, వారి పేర్లు జాబితాలో ఉంటే వాటిని కూడా మ్యాప్ చేస్తున్నారు. చనిపోయిన ఓటర్ల పేర్లు ఇప్పటికీ జాబితాలో ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కూడా జరుగుతోంది. ఎస్‌ఐఆర్‌ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ మ్యాపింగ్ డేటా కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

50 శాతం పాత ఓటర్లు కనిపించడం లేదు!

ప్రస్తుత మ్యాపింగ్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50 శాతం మంది కూడా స్థానికంగా నివాసం ఉండడం లేదని బీఎల్‌వోలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ శాతం 30కు మించడం లేదట. నగరాల వలసలు, మారిన నివాసాలు ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 620 మండలాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు, 10,434 రెవెన్యూ గ్రామాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 83.04 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. ఎస్‌ఐఆర్ సర్వే జరిగితే ఇంటింటా సందర్శించి కుటుంబ వివరాలు సేకరిస్తారు.

ప్రామాణిక గుర్తింపు కార్డులు ఇవే

సర్వేలో కేంద్రం నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులను ఆధారంగా తీసుకోనున్నారు:

పాస్‌పోర్టు

కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగుల గుర్తింపు కార్డు

01-07-1987కు ముందు జారీ చేసిన ఆధారాలు (ప్రభుత్వ/బ్యాంకులు/ఎల్‌ఐసీ)

జనన ధ్రువీకరణ పత్రం

కుల ధ్రువీకరణ పత్రం

విద్యా ధ్రువీకరణ పత్రం

స్థిర నివాస ధ్రువీకరణ పత్రం

అటవీ హక్కుల పత్రం

జాతీయ గుర్తింపు కార్డు

కుటుంబ గుర్తింపు పత్రం

భూమి/ఇంటి కేటాయింపు పత్రం

ఈ సన్నాహాలతో తెలంగాణ ఎస్‌ఐఆర్ సర్వేకు పూర్తి సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News