Revanth Reddy : భారత్ అభివృద్ధిలో తెలంగాన రాష్ట్రం కీలకం – రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ ఇందుకు లక్ష్య సాధన పత్రం;
2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుందని ఆ సమయానకి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047 అని సీయం ప్రకటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గొల్కొండ ఖిల్లాలో సీయం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుందన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదని ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని అన్నారు. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోందన్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుందని సీయం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నామన్నారు. 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పమని ప్రకటించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రెండు నాకు రెండు కళ్లని సీయం పేర్కొననారు.
తెలంగాణను దేశ క్రీడా మైదానంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. మేటి క్రీడా కారులను తయారు చేసి... ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాల సాధనే లక్ష్యంగా ఇటీవలే నూతన క్రీడా పాలసీని ఆవిష్కరించామన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ (YIPESU)ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ వర్సిటీ నిర్వహణ కోసం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. అదే సమయంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా 15,600 కోట్ల రూపాయల వ్యయంతో 78 పాఠశాలల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య రంగం అభివృద్ధికి రూ.39 వేల 575 కోట్ల రూపాయలు వ్యయం చేశామని ఈ మొత్తాన్ని మేం ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని సీయం స్పష్టం చేశారు. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తామని సీయం ధీమా వ్యక్తం చేశారు.
మన బలం హైదరాబాద్… ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్ ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాల్సిన అవసరాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన 72వ ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగిందన్నారు. గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నామని తెలిపారు. అలాగే దేశంలోనే మొదటి సారి...గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) సదస్సు నిర్వహించామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వచ్చే డిసెంబర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని సీయం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణమన్నారు. డ్రగ్స్ పై పోరు కోసం ఏర్పాటు చేసిన ఈగల్ గొప్పగా పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ విభాగాన్ని మెచ్చుకున్నారు.