TGPSC : గ్రూప్-1 మెయిన్స్ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు సిద్ధమైన టీజీపీఎస్సీ
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు సిద్ధమైన టీజీపీఎస్సీ
TGPSC : తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సవాల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం టీజీపీఎస్సీ కీలక సమావేశం నిర్వహించి, న్యాయపరమైన అంశాలను చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అయితే, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం, మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా పత్రాలను రీ-వాల్యూయేషన్ చేయాలని, అది సాధ్యం కాకపోతే మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.