Cm Revanth Reddy : ఇంఛార్జ్‌ మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

టీపీసీసీ పీఏసీ సమావేశంలో సీయం అసహనం;

Update: 2025-07-04 09:38 GMT

ఇంఛార్జ్‌ మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌ లో జరిగిన టీపీసీసీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సీయం రేవంత్‌ మాట్లాడుతూ ఇంఛార్జ్‌ మంత్రులు ప్రతి అంశాన్నీ సీరియస్‌ గా తీసుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో చాలా సీరియస్‌ గా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులందరూ దృష్టి పెట్టాలని సీయం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి మూడు పార్టీలు కలసి వస్తాయని కాబట్టి మనం సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రదానంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకు వచ్చ బాధ్యత ఇంఛార్జ్‌ మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్లదే అని సీయం ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందు తేల్చి చెప్పారు. అలాగే పార్టీ పదవులు భర్తీ చెయ్యడంలో పీసీసీ చీఫ్‌ జాప్యం చేస్తున్నారని అన్నారు. వెంటనే పార్టీ పదవులు అన్నీ భర్తీ చేయాలని సూచించారు. కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో సాధ్యమైనంత వరకూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దామని, ఆ ఎన్నికల్లో నేషనల్‌ నేరేటివ్‌ బిల్డ్‌ చేసుకోవాలని సీయం రేవంత్‌ రెడ్డి అన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర ఆదర్శంగా నిలుస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా మనం విజయం సాధించామని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో మనం చాలా విజయాలు సాధించామని చెప్పారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు దక్కాయని పేర్కొన్నారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అందువల్ల పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్ గా తీసుకోవద్దని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని నూతన నాయకత్వానికి 2029లో ఎక్కువ అవకాశాలు ఉంటయన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, అందరం కలసికట్టుగా ఈ రోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని మళ్ళీ రెండో సారి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సీయం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే పదేళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్‌ దే అధికారమని సీయం రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News