Varuna Yagam: నాగార్జునసాగర్‌లో వరుణయాగం ప్రారంభం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
Varuna Yagam: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో విలసిల్లాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుణయాగం నాగార్జునసాగర్ విజయ్‌విహార్ ప్రాంగణంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది.
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరుగుతోంది. కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4:05 గంటలకు ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం వంటి కార్యక్రమాలు జరిగాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, దేవాదాయశాఖ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రం వర్షాలతో సస్యశ్యామలమై వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ వరుణయాగం నిర్వహించబడుతోంది.