GST Counsil : 12 శాతం స్లాబ్ ను తొలగించడం స్వాగతిస్తున్నాం
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క;
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో భాగంగా 12% స్లాబ్‌ను తొలగించడం, కొన్ని వస్తువులు మరియు సేవలపై పన్ను రేట్లను తగ్గించడం ఉన్నది. ఈ ప్రతిపాదనకు మేము సూత్రప్రాయంగా స్వాగతం పలుకుతున్నమని జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆయన హాజరై పలు సూచనలు చేశారు. అదే సమయంలో, ఈ ప్రతిపాదనలో భాగంగా కొన్ని ఇతర వస్తువులు మరియు సేవలపై పన్ను రేట్లను పెంచే అంశం కూడా ఉంది అన్నారు. ఈ ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాంతో, వినియోగదారులకు లాభం చేరేలా చూసుకోవడంతో పాటు, రాష్ట్ర ఆదాయాలపై దీని ప్రభావం మరియు దానికోసం ఉండే పరిహార వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలనీ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే రేటు రేషనలైజేషన్ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రుల సమూహం ఏర్పాటు చేసింది. కాబట్టి, ఈ ప్రతిపాదనలను రేటు రేషనలైజేషన్‌పై ఉన్న ఆ మంత్రుల సమూహానికి పంపించడం సముచితమని భావిస్తున్నాను అన్నారు. వారు విషయాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించి జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సులు చేస్తే, కౌన్సిల్ తగిన నిర్ణయం తీసుకోగలదనీ తెలిపారు. పరిహార సెస్సు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేస్తోంది. ఈ విషయాన్ని కూడా రేటు రేషనలైజేషన్ మంత్రుల సమూహానికి పంపడం సముచితమవుతుందనీ, తద్వారా వారు సమగ్ర సిఫార్సులు చేయగలరు అన్నారు. చివరగా, రాష్ట్రాల అభిప్రాయాలు ఎక్కువ సంఖ్యలో ప్రతిఫలించేలా రేటు రేషనలైజేషన్‌పై మంత్రుల సమూహం సభ్యత్వాన్ని పెంచడం కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశంలో వివరించారు.