Dy Cm : జనవరి 15 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తాం

డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమారక్క వెల్లడి;

Update: 2025-08-22 10:24 GMT
  • దేశంలో ఉత్తమ గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్రంగా తెలంగాణ
  • యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లో విద్య, వైద్య సౌకర్యాలను కల్పిస్తాం
  • కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్

రానున్న జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వగా దాదాపు రెండు సంవత్సరాల పాటు నాటి పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల పెట్టుబడి తో ప్రారంభించిన పరిశ్రమ ఒక్కరోజు ఆలస్యమైన ఆర్థిక భారం తీవ్రంగా రాష్ట్ర ప్రజలపై పడింది అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని అనుమతులు సాధించి రెండు యూనిట్లు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని తెలిపారు. వీటితోపాటు పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసేందుకు రైల్వే లైన్, కార్మికులు అధికారులు ఉండేందుకు టౌన్షిప్ ఏర్పాటు ఇవన్నీ నిర్దేశిత సమయాన్ని నిర్ణయించుకొని ముందుకు పోతున్నామని తెలిపారు. బీహెచ్ఈఎల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరాల్లోని గ్రామాల్లో ప్రపంచ స్థాయి విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా CSR నిధుల నుంచి అందజేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. పవర్ ప్లాంట్ పరిసరాలలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా , రహదారులు దెబ్బతినకుండా ప్రత్యేకంగా సిసి రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణ క్రమంలో భూ సేకరణకు అవసరమైన నిధులను మంజూరు చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.

కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం తెలిపారు. 1978లో నే నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జపాన్ నుంచి మిత్సుబిషి వంటి కంపెనీల నుంచి యంత్రాలు తెప్పించి పంపుడు స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో నిర్మించిన హైడల్, థర్మల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు గొప్పగా నడుస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అత్యున్నత, అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తికి తెలంగాణను కేంద్రంగా చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.

రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును 17 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ఉచితంగా అర్హులకు అందిస్తుంది అన్నారు. పేదల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు వేల కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఓవైపు ఉచిత విద్యుత్ పథకాలు, మరోవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు.

భూ నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాలను కంప్యూటర్లో పెడితే వారు డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు, సమావేశం నిర్వహించడం డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం విమర్శించారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మానవ విలువలతో కూడింది, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోయేది కాదు, అంతా కలిసి ఒక కుటుంబ సంబంధంతో పండుగల నిర్వహించుకునే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం వివరించారు.

భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక సుదీర్ఘకాలంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్వాసితులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని గొప్ప సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా 500 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇవ్వగలిగామని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ ఉద్యోగాల నియామకం మూలంగా 500 కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సేవలు అందించాలి అన్నారు. నిర్వాసితులకు ఉద్యోగాల కోసం ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా పోరాటం చేశారని.. వారి సంకల్పం నేడు సహకారం అయ్యింది అని డిప్యూటీ సీఎం అన్నారు.

ఉద్యోగాలు పొందిన వారిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన వారు ఉన్నారు అని తెలిపారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ అంటే కేంద్రంలోని సోనియా నాయకత్వంలో పనిచేసిన యూపీఏ ప్రభుత్వంలో గిరిజనులు గౌరవంగా బతికేందుకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం చేయడంతోనే వారికి భూములు దక్కాయి అని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించారని భట్టి విక్రమార్క తెలిపారు.

Tags:    

Similar News