Tcongress : బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఉద్యమిస్తాం… కాంగ్రెస్
సీయం రేవంత్ నేతృత్వంలో రాహుల్, ఖర్గేలతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు;
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఏవిధంగా శాస్త్రీయ బద్దంగా నిర్వహించామన్న విషయాన్ని పార్టీ అగ్రనేతలకు వివరించామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు ఏసీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే విధివిధానాలపై చర్చించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై కూడా చర్చించామన్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మేము ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఖర్గేలు శ్రద్ధగా విన్నారని ఆయన చెప్పారు. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయం కూడా ఇరువురు అగ్రనేతలకు వివరించామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన బిల్లులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్రం పంపిన బిల్లుల ఆమోదానికి కేంద్రంతో పోరాడాలని విజ్ఞప్తి చేసినట్లు మహేష్ గౌడ్ చెప్పారు. అలాగే సుప్రీం కోర్ట్ రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించేందుకు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలని కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసిందని, నిర్ణయం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని, శాసనసభలో అనుకూలంగా ఓటు వేసిన బీజేపీ కేంద్రం వద్దకు వచ్చే సరికి యూటర్న్ తీసుకుందని మహేష్ గౌడ్ విమర్శించారు. ఈ విషయంపై ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలో మాట్లాడతామని చెప్పారు. కేంద్ర బిసి రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే రాహుల్ గాందీ నేతృత్వంలో ఉద్యమం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన కులగణనపై గురువారం సాయంత్ర 5 గంటలకు ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీయం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీయం భట్టి విక్రమార్కలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.