Minister Satyakumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ 15% పెంపు అసాధ్యం: మంత్రి సత్యకుమార్
మంత్రి సత్యకుమార్
Minister Satyakumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూనియర్ డాక్టర్ల స్టైపెండ్‌ను 15 శాతం పెంచలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గురువారం సచివాలయంలో ఏపీ జూడా అధ్యక్షుడు యు.ఈశ్వర్ శంకర్, ఉపాధ్యక్షుడు జి.భార్గవసాయి నాయుడు తదితర ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. జూడాలు మూడు ప్రధాన డిమాండ్లను లేవనెత్తగా.. స్టైపెండ్ పెంపు తప్ప మిగిలిన రెండింటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు, ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారిని నాన్-క్లినికల్ పోస్టుల్లో నియమించాలన్న ప్రతిపాదనలపై జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాల్టీ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంచాలన్న డిమాండ్ ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల అమలులో భాగంగా దూర ప్రాంతాల్లోని బోధనా ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ కాని పక్షంలోనే నాన్-క్లినికల్ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారిని నియమించాల్సి వస్తోందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇంటర్న్‌లు (హౌస్ సర్జన్లు)కు ఈ ఏడాది 5 శాతం పెంచి, వచ్చే ఏడాది నుంచి 3 శాతం చొప్పున పెంచుతామని, పీజీ, సూపర్ స్పెషాల్టీ పీజీలకు ఏటా 3 శాతం చొప్పున స్టైపెండ్ పెంచుతామని మంత్రి వెల్లడించారు. అవసరమైతే మరోసారి చర్చలకు సిద్ధమని కూడా ఆయన తెలిపారు.
అయితే ఏపీ జూడా మాత్రం స్టైపెండ్ పెంపు డిమాండ్‌ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడానికి సిద్ధమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఏటా సవరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ స్టైపెండ్ పెంపు విషయంలో సంతృప్తి చెందలేదని, సంతృప్తికరమైన పరిష్కారం లభించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసింది.