Chandrababu’s Blueprint: ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని ఆయన వివరించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన గురువారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌, డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌తో అనుసంధానించాలని, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను నెలకొల్పాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాల పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

‘‘కలిసి నడుద్దాం.. కలిసి ఎదుగుదాం’’

‘‘రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయి. 2047 నాటికి దక్షిణ భారతానికి 10 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత వాటా 31 శాతం ఉందని, 2047 నాటికి భారత్‌ 30-35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు.

దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థయాత్ర సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మదురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్‌ధామ్‌ క్షేత్రాలతో కలిపితే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని అన్నారు.

విభజన సమస్యలు ఇప్పటికీ తీరలేదు

రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్‌ అంశాల్ని సీఎం ప్రస్తావించారు. విభజన జరిగి 12 ఏళ్లయినా 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన పూర్తికాలేదన్నారు. ‘‘ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో సమన్యాయం జరగాలి. విభజన చట్టంలోని సెక్షన్‌ 66 కింద ఉన్న అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం గత తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. సెక్షన్‌ 56లోని సమస్యలు, వనరుల లోటు, ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్నీ పరిష్కరించాలి’’ అని కోరారు.

కేంద్రం హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటవడం సంతోషదాయకమన్నారు. పోలవరం, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమని చెప్పారు. దిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల విభజన అంశాన్నీ ప్రస్తావించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌-13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వాలని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధానికి రైలు అనుసంధానం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నం పోర్టు, బీపీసీఎల్‌ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్‌ స్టీల్‌కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

నదుల అనుసంధానంతో మిగులు జలాలు

నీటి భద్రతపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీ కంటే ఎక్కువ మిగులు వరద నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు. ఇది తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా-కావేరి అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని, సమయపాలనతో డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని కోరారు.

దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: