YS Vivekananda Reddy Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసు: అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ రూ.24 లక్షల నగదు సీజ్
రూ.24 లక్షల నగదు సీజ్
YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ హైదరాబాద్, కడప సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో నేరానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
వైకాపా ఎంపీ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని రూ.24 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్ల తాళాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ శుక్రవారం అధికారిక ప్రకటనలో వివరించిన ప్రకారం, వివేకానంద రెడ్డి హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని దస్తగిరి వెల్లడించారు. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేశారని, అందులో వాటాగా రూ.5 కోట్లు దస్తగిరికి ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టారని ఈడీ తెలిపింది.
ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 120బి, 302తో పాటు పీఎంఎల్‌ఏ కింద ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ వివరించింది. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది.