CM Chandrababu: హైదరాబాద్‌ను మించిన మహానగరంగా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లి గుహల వద్ద ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ప్రతి ఇంటికీ యోగాను చేరువ చేయాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమని, మిషన్ మోడ్‌లో యోగాను అందరికీ అందించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం చేసే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చాడని చెప్పారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణకు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్నాయని, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్లస్ అమరావతి:
హైదరాబాద్ కంటే మెరుగైన ‘హైదరాబాద్ ప్లస్’గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఆరోగ్యవంతమైన (హెల్తీ), సంపన్నమైన (వెల్తీ), సంతోషకరమైన (హ్యాపీ), ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేసి ఉన్నత స్థాయి రాజధానిని నిర్మిస్తామని, నాలెడ్జ్ హబ్‌గా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
యోగా ద్వారా బాబా రామ్‌దేవ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారని, యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఏకాగ్రత సాధించవచ్చని సీఎం వివరించారు.
టెక్నాలజీ మాత్రమే సంపద తెచ్చిపెట్టదని, భారత్‌కు అత్యంత అమూల్యమైన శక్తి ఆధ్యాత్మికత మరియు సంస్కృతి అని చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుని యువత ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యోగా ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే ఆలోచనలను సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.