First Quantum Incubator: ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం

క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం

Update: 2026-06-20 09:38 GMT

మన్నవ మోహన కృష్ణ, ఛండీఘర్ యూనివర్సిటీ మధ్య ఎంఓయూ

First Quantum Incubator: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలు, ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మేధా టవర్స్‌లో ఏపీలో మొదటి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ, ఛండీఘర్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సందు, క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ లు శుభారంభం చేశారు.

ఈ సందర్భంగా ఛండీఘర్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ (CUBIC)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మయూరి టెక్‌లో మన్నవ మోహన కృష్ణ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఇంక్యుబేషన్ కార్యక్రమాల్లో పరస్పర సహకారం పెరుగుతుంది.

మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన ఛండీఘర్ యూనివర్సిటీతో భాగస్వామ్యం రాష్ట్ర యువతకు అపూర్వ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. క్వాంటం ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు ప్రపంచ స్థాయి మెంటారింగ్, అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్యాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

సీఎం చంద్రబాబు దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఏపీని క్వాంటం, డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, క్వాంటం టెక్నాలజీ భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే విప్లవాత్మక రంగమని, ఈ అవకాశాలను రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త ఇంక్యుబేటర్ ఏపీలో ఉన్నత సాంకేతికత, స్టార్టప్ ఇకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుందని అంచనా.

Tags:    

Similar News