AP Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Minister Nara Lokesh: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపికబురు అందించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 10,060 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఎక్స్‌లో విడుదల చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇకపై ప్రతి ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ క్యాలెండర్‌లో నాలుగు విడతల్లో మొత్తం 41 నోటిఫికేషన్లు విడుదల చేసి అన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ తేదీలతో పాటు పరీక్షల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించనున్నారు. సిలబస్ కూడా ముందస్తుగా విడుదల చేస్తారు.
శాఖలవారీగా పోస్టులు
పాఠశాల విద్య: 3,004 పోస్టులు (అత్యధికం)
హోంశాఖ: 2,778 పోస్టులు
హయ్యర్ ఎడ్యుకేషన్: 1,500 అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఇతర శాఖలు: మిగిలిన పోస్టులు (ప్రొహిబిషన్ & ఎక్సైజ్ 452, వాటర్ రిసోర్సెస్ 224 ఏఈఈలు, ఫైనాన్స్ 169, అడవులు మొదలైనవి)
మొదటి నోటిఫికేషన్ మే 15, 2026న విశ్వవిద్యాలయాల్లో 1,500 అసోసియేట్, సహాయ ఆచార్యుల పోస్టులకు విడుదల చేస్తారు. సహాయ ఆచార్యుల పోస్టులకు 2018లో జరిగినట్లుగా ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-1, గ్రూప్-2, ఇంజినీరింగ్, ఇతర శాఖల నోటిఫికేషన్లు సెప్టెంబర్ 15 వరకు, పాఠశాల/ఇంటర్ విద్య పోస్టులకు అక్టోబర్ 15 వరకు విడుదల చేస్తారు.
నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్
అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/job-calendar పోర్టల్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ నంబరు, సెల్‌ఫోన్ ఓటీపీ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. ఇలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటనలతో పాటు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు ఉద్యోగాల సమాచారం సందేశాల రూపంలో అందుతుంది. పోర్టల్‌ను నియామకాల పోర్టళ్లతో అనుసంధానం చేస్తారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. నా మాట నిలబెట్టుకున్నానని, నిరుద్యోగ యువత బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు కొత్త ఆశాకిరణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.