MP Chintakayala Vijay: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ హయాంలోని ఐదేళ్ల పాలనలో బీసీలను ఊచకోత కోశారని, రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీలను రాజకీయంగా వాడుకుని మోసం చేస్తే రాష్ట్రంలో వైకాపాను లేకుండా చేస్తారని హెచ్చరించారు. జగన్‌కు చెక్‌ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారని అన్నారు.

బడుగు, బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఎంపీ విజయ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వల్లే బీసీలు ‘బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌’ నుంచి రాష్ట్రానికే ‘బ్యాక్‌బోన్‌’గా మారారని తెలిపారు. 1987లోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రాజకీయ అధికారం కల్పించిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించిందని చెప్పారు.

వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి 16,800కు పైగా పదవులను లాగేసుకున్నారని దుయ్యబట్టారు. 50కు పైగా బీసీ కార్పొరేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుని ఒక్క రూపాయి నిధులు గానీ, కార్యాలయాలు గానీ ఇవ్వకుండా బీసీలను మోసం చేశారని ఆరోపించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు, లోన్లు నిలిపివేసి చీకటి జీవోలతో బీసీల సంక్షేమాన్ని అణగదొక్కారని తీవ్రంగా విమర్శించారు.

జగన్‌ హయాంలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, సబ్బం హరి వంటి సీనియర్‌ బీసీ నేతలపై అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్‌నాథ్‌ గౌడ్‌, సుబ్బయ్య, చంద్రయ్య వంటి ఎంతోమంది బీసీలపై దాడులు, హత్యలు జరిగినా జగన్‌ పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో బీసీలపై దాదాపు 26 వేల తప్పుడు కేసులు బనాయించి తీవ్ర అణచివేతకు గురిచేశారని ఆరోపించారు. వైసీపీలో బీసీ నాయకులు బానిస బతుకులు బతికారని, వారిని కేవలం ఇతరుల ఇళ్లపై దాడులు చేయడానికే వాడుకున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు చింపివేసి బలవంతపు ఏకగ్రీవాలు చేసి చెడు సాంప్రదాయాన్ని జగన్‌ ప్రారంభించారని తెలిపారు.

మా ప్రభుత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళలకే దాదాపు 8,300కు పైగా రాజకీయ పదవులు దక్కనున్నాయని ఎంపీ విజయ్‌ చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లతో బీసీ యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌ వంటి అవినీతి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు బీసీ కార్డు వాడుతున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీకి, బీసీలకు విడదీయరాని బంధం ఉందని, తెలుగుదేశం అంటే తమ పార్టీ అని బడుగు బలహీన వర్గాలు గర్వంగా చెప్పుకొంటున్నాయని అన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా బీసీలంతా ఏకమై సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Tags: