CM Chandrababu: భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎదగాలని, అందులో ఆంధ్రప్రదేశ్‌ ముందుండి నడిపించేలా ఆశీర్వదించాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కాపాడి అన్నివిధాలా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని వెల్లడించారు. తిరుమలలో ఎక్కడాలేని క్రమశిక్షణ కనిపిస్తోందని, ఒక దేవాలయాన్ని ఎలా నిర్వహించాలో తితిదే యాజమాన్యం దేశానికి చాటిచెబుతోందని అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని, దేశ, విదేశాల్లోని హిందువులందరూ జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వచ్చి దేవుణ్ని దర్శించుకోవాలని ఆశిస్తారని, వారికి సంతృప్తికరంగా దైవదర్శనం కల్పించేలా తితిదే పాలకమండలి, సిబ్బంది పనిచేయాలని సూచించారు.

ఇవాళ తిరుమలలో సీఎం రెండో రోజు పర్యటన కొనసాగింది. భాగంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద ‘పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ను ప్రారంభించారు. అనంతరం రిలయన్స్‌ సంస్థ (అనంత్‌ అంబానీ) అందించిన 25, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, కో ఛైర్‌పర్సన్‌, ఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు సమకూర్చిన మరో 7 ఎలక్ట్రిక్‌ బస్సులను నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ప్రారంభించారు. అక్కడి నుంచి ఎస్వీ మ్యూజియం వరకు సీఎం బస్సులో ప్రయాణించారు. ఆ తర్వాత ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంలో జీ+3 అంతస్తులు, 19 గ్యాలరీలు, 14 వేల కళాఖండాలు ఉన్నాయి. నందకం యాప్, భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్‌ పథకం కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించారు.

Tags: