CM Chandrababu: అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకునేందుకు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు యత్నిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్‌ పర్యటన సందర్భంగా వైకాపా కార్యకర్తలు పరిధి దాటి ప్రవర్తించారని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేసి పరామర్శ ముసుగు తగిలించుకున్నారని విమర్శించారు. ‘‘దేవరపల్లిలో వైకాపా శ్రేణులు ఓ మహిళా చిరువ్యాపారి పొట్టగొట్టారు. రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్‌ తయారవుతున్నారు. గంజాయి బ్యాచ్‌ను జెన్‌ జీ అని చెప్పుకోవడం గొడ్డలి పార్టీకే చెల్లింది’’ అని సీఎం వ్యాఖ్యానించారు.

పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించామనే అసూయతో వైకాపా కుట్రలు చేస్తోందని, డీఎస్సీపై కేసులను కొట్టేసి కోర్టులు చీవాట్లు పెడుతున్నా వారు బుద్ధి మార్చుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. హారిజాంటల్‌, వర్టికల్‌ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కూడా విమర్శించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన 2047-వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలను స్వర్ణాంధ్ర విజన్‌-2047 ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని పూర్తిగా అధిగమించాలని, ఆ తర్వాత పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

ఈనెల 17 నుంచి 20 మధ్య నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. గత పాలకులు దిశ చట్టం పేరుతో ప్రజలను మోసగించి, కేవలం ఉత్తుత్తి పోలీస్‌ స్టేషన్లు, వాహనాలతో హంగామా చేయడం తప్ప మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల భద్రత కోసం సమగ్రంగా చట్టసవరణ చేసి, మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని ప్రకటించారు.

ఈ నెల చివర్లోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి నల్లమల సాగర్‌కు నీరందిస్తామని, రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ పనితీరు డిసెంబర్‌ లేదా జనవరిలో ప్రారంభమవుతుందని సీఎం వెల్లడించారు. గిరిజనులు తమ సంప్రదాయ నృత్యంతో గిన్నిస్‌ రికార్డు సృష్టించడం అభినందనీయమని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకున్నారని, అక్కడ సముద్రం మీదుగా విమానాలు వచ్చి రన్‌ వేపై ల్యాండ్‌ అవడం ప్రయాణికులకు గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు.

ఆక్వా ఫీడ్‌ ఎగుమతులను 50 శాతం తగ్గించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఈనెల 13న సీడ్‌ యాక్సిస్‌ రహదారిని ప్రారంభిస్తామని, దుబాయ్‌ ఐ వీల్‌ కంటే అమరావతి ఐ వీల్‌ పెద్దదిగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: