CM N. Chandrababu Naidu: సీఎంఆర్‌ఎఫ్ నిధుల విడుదల దస్త్రంపై ఉగాది రోజు చంద్రబాబు తొలి సంతకం
ఉగాది రోజు చంద్రబాబు తొలి సంతకం
రూ.55.63 కోట్లు.. 6,787 మంది పేదలకు లబ్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ.1,241 కోట్లకు పైగా సాయం.. 1.36 లక్షల మందికి ఉపయోగం
CM N. Chandrababu Naidu: పరాభవ నామ ఉగాది పుణ్యదినాన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్) నిధుల విడుదల దస్త్రంపై సంతకం చేశారు. దీంతో రూ.55.63 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఈ మొత్తం ద్వారా 6,787 మంది పేదలకు ఆర్థిక, వైద్య సహాయం అందుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వైద్య సహాయం, ఎల్‌వోసీల ద్వారా రూ.1,241 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించింది. దీని ద్వారా మొత్తం 1,36,240 మందికి లబ్ధి చేకూరింది. సంవత్సరాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
2024లో: 15,206 మందికి రూ.184 కోట్లు
2025లో: 1,03,568 మందికి రూ.889 కోట్లు
2026లో ఇప్పటి వరకు: 17,466 మందికి రూ.169 కోట్లు
ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి వైద్య అవసరాల కోసం నిధులకు ఎలాంటి కొరత రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో పేదలకు గణనీయమైన మేలు జరుగుతోందని పేర్కొంది.
వేదాశీర్వచనం
ఉండవల్లి నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), విజయవాడ దుర్గ గుడి అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి, దుర్గ గుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.