Minister Nara Lokesh: పార్టీయే సుప్రీం.. అప్పగించిన పనులకు అగ్రప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో పార్టీయే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్నవారిని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని ఆదేశించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు, లీడర్‌షిప్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ అప్పగించిన పనులకు తప్పనిసరిగా అగ్రప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని పూర్తి చేయాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.
క్వాంటం టవర్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చినా, పార్టీ తనకు పని అప్పగించిందని చెప్పి తాను హాజరు కాలేనని స్పష్టం చేశానని లోకేశ్ తెలిపారు. పార్టీ ఇచ్చిన పనులను ఏ మాత్రం వాయిదా వేయకుండా పూర్తి చేయాలని, వాటికే హై ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. పార్టీ పదవుల్లో ఉన్నవారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడానికి ఎవరి అనుమతి అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీ-ఫారం ఇవ్వకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కాలేరని తేల్చి చెప్పారు. పార్టీని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నిరంతరం సమీక్షించుకుంటూ కేడర్ ముందుకు వెళ్లాలని సూచించారు.
మై-టీడీపీ యాప్‌లో పార్టీ కార్యక్రమాల వివరాలను పూర్తిగా అప్‌డేట్ చేస్తున్నామని వెల్లడించిన లోకేశ్, ఆ సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. పార్టీ కార్యకలాపాలపై నిరంతరం దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.