CM Chandrababu: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని, సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూటమిదే జయమని, కూటమిలో ఐకమత్యం కీలకమని స్పష్టం చేశారు. గిల్లికజ్జాలతో రచ్చకెక్కొద్దని, లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితబోధ చేశారు.

స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అన్నింటిలో విజయం సాధించాలన్నారు. మహిళా రిజర్వేషన్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సమర్థవంతమైన మహిళా నేతలను ముందుగానే గుర్తించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలను పరిష్కరించామని, ప్రజల్లో ఉన్న సానుకూలత స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలించాలని ఆకాంక్షించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 25 ప్రాధాన్యతా అంశాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక తయారు చేస్తామని, విశాఖ రీజియన్‌కు పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారు. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే అన్ని సమస్యలు తీరుతాయని అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి లీడర్‌షిప్ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, ఉత్తమ పద్ధతులను తదుపరి సమావేశంలో ప్రదర్శించాలని తెలిపారు.

కుప్పం నియోజకవర్గ నేతలతో ఉండవల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు, స్థానిక ఎన్నికలకు శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు మండలాల ముఖ్య నేతలతో మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా సాగాలన్నారు. ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదని, పదవులు తీసుకుని కష్టపడకుండా కారణాలు చెప్పకూడదని హెచ్చరించారు. కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే కుప్పంలో రెండు రోజులు పర్యటిస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఏఎంసీ ఛైర్మన్ జీఎం రాజు, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Tags: