MP Lavu Sri Krishna Devarayalu: అకడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సూచించారు. శనివారం విజయవాడలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ నటి రేజినా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే పబ్లిక్ సర్వీసెస్‌పై ఆసక్తి పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీసెస్ వైపు యువతను ప్రోత్సహించాలని అన్నారు. ప్రజాసేవ ద్వారా లక్షలాది మందికి మేలు చేసే అవకాశం కలుగుతుందని వివరించారు.

అధికారులకు సమాజంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతతోపాటు నాయకత్వ లక్షణాలు పెంచాలని, విద్యార్థుల మనసును అర్థం చేసుకుని వారిని గైడ్ చేసే ఉపాధ్యాయులు ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు. చురుకైన పౌరులుగా యువతను తీర్చిదిద్దడమే డెమోక్రటిక్ సంఘం లక్ష్యమని స్పష్టం చేశారు. కోర్టులు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల పనితీరుపై కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డెమోక్రటిక్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.

Tags: