Arav Arrested: మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్‌ను కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన కేసులో అరవ్‌పై చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మూడు రోజుల క్రితం కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడుపుతూ దానయ్యను ఢీకొని చంపిన ఘటనలో అరవ్ ప్రధాన నిందితుడని సీసీటీవీ ఫుటేజ్‌లు స్పష్టం చేశాయి. మొదట్లో సిద్ధు అనే యువకుడు తానే ప్రమాదం చేశానని ఒప్పుకున్నా, తర్వాత పోలీసుల లోతైన దర్యాప్తులో నిజం బయటపడింది.

ప్రమాదానికి ముందు సమీప పెట్రోల్ బంక్‌లో అరవ్ బైక్‌కు పెట్రోల్ నింపిన వీడియోలు, పలాసలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేయించిన ఆధారాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి కుమారుడిని కేసు నుంచి తప్పించాలని చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎండగట్టారు.

ప్రస్తుతం అరవ్‌ను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Tags: