Former Minister Seediri Appalaraju Arrested: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. కుమారుడి నేరం కప్పిపుచ్చే కుట్రలో ఏ-3

నేరం కప్పిపుచ్చే కుట్రలో ఏ-3

Update: 2026-07-23 09:43 GMT

Former Minister Seediri Appalaraju Arrested: ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ద్విచక్రవాహనంతో ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన కేసులో మాజీ మంత్రి కుట్రలో భాగం వహించినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కుమారుణ్ని కేసు నుంచి తప్పించి, నేరం మరొకరిపై మోపేందుకు ప్రయత్నించినట్టు ఆయనను ఈ కేసులో ఏ-3గా చేర్చారు.

అరెస్టు సమయంలో ఉద్రిక్తత: అరెస్టు సమయంలో వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పలరాజును పోలీసు వాహనంలో ఎక్కించకుండా నిరోధించడంతో పోలీసులతో తోపులాట, వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు అప్పలరాజును భుజాలపై ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అప్రమత్తమై ఆయనను వాహనంలో ఎక్కించి తరలించారు. ఈ ఘటనలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

అప్పలరాజు కుమారుడి రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్‌మిస్ చేసింది. అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ అరెస్టుపై స్పందించిన అప్పలరాజు, కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడుతోందని, తాము భయపడేది లేదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News