High-Power Committee: ఎస్సీ, ఎస్టీల రక్షణ-సంక్షేమం-అభివృద్ధికి నాలుగు అంచెల కార్యాచరణ ప్రణాళిక: సీఎం చంద్రబాబు అధ్యక్షతన హైపవర్ కమిటీ నిర్ణయం
హైపవర్ కమిటీ నిర్ణయం
High-Power Committee: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు మరియు సంక్షేమం-అభివృద్ధి అంశాలపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలలో ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, వారికి అమలవుతున్న పథకాలు, అలాగే వారి సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు అంశాలను సమన్వయంతో అమలు చేయడానికి నాలుగు అంచెల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది.
అధికారులు సమావేశంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసులన్నీ పరిష్కృతమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం రాష్ట్రంలో 14 స్పెషల్ సెషన్ కోర్టులు మరియు ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నాయి. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో మొత్తం రూ.15.43 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల రక్షణకు మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి. అనిత, జి. సంధ్యారాణి, ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, అలాగే ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు.