CM Chandrababu: తాను ‘సీఈవో సీఎం’గా కంటే నీటిని అందించిన నాయకుడిగా ప్రజల్లో గుర్తుండాలనుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

శనివారం ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన ‘సీఈవో సీఎం టు వాటర్ మ్యాన్: నాయుడుస్ లాంగ్ జర్నీ ఎంటర్స్ ఎ న్యూ ఫేజ్’ అనే కథనం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు మైలురాళ్లని ఆయన అభివర్ణించారు. దశాబ్దాలుగా కలగా ఉన్న ఈ రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు కనిపిస్తుందని సీఎం అన్నారు. రైతులకు ఆశ, వ్యవసాయానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటు తాగునీటి భద్రతకు చిరస్థాయిలో నిలిచిపోయే ఆస్తులుగా ఇవి మిగులుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇలా నీటి భద్రతను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు సందేశం స్పష్టమైంది.

Tags: