Deputy CM Pawan Kalyan: ఆర్థిక ఇబ్బందుల మధ్య మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టాం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Update: 2026-05-20 12:29 GMT

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రెండో ఏడాది కూడా రూ.20 వేలు భృతి విడుదల

1.30 లక్షల మత్స్యకారులకు రూ.262 కోట్లు సాయం

Deputy CM Pawan Kalyan: ఆర్థిక సవాళ్ల మధ్యనూ మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ కాలంలో ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీవ్రమైన నిబద్ధతతో ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని అన్నారు.

గత ప్రభుత్వం కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చేదని, కూటమి ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలు అందిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వెచ్చిస్తోందని, ఇందులో 1.30 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని వివరించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్లు అందించడం జరుగుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లోనే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు బలమైన ఆసరాగా నిలుస్తున్నాయని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి ఎత్తడం ప్రభుత్వ ధ్యేయమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News