Minister Lokesh Impressed: బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రసంగం మంత్రి నారా లోకేశ్‌ను ఆకట్టుకుంది. యువతరం రజనీకాంత్ నుంచి చాలా నేర్చుకోవాలని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేసి ప్రశంసించారు.

ఉదయం లేవగానే రజనీకాంత్ స్పీచ్ విన్నానని, అందులోని ప్రతి అంశం బాగా నచ్చిందని లోకేశ్ తెలిపారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ హుందాగా, వినయంగా స్టార్‌డమ్‌ను స్వీకరించే ఆయన వైఖరి ఆశ్చర్యపరిచిందన్నారు. యువతరం ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

రజనీకాంత్ ఏమన్నారు?

హిమాలయాల తర్వాత ఈ ఆశ్రమం తనకు ఎంతో నచ్చిందని రజనీకాంత్ చెప్పారు. ముందు రెండు రోజులు ఉండాలని ప్లాన్ చేసినా 15 రోజులు ఉండిపోయానన్నారు. ఒక సాయంత్రం వేలాది భక్తుల మధ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పిలుపు మేరకు వేదికపైకి వెళ్లానని వివరించారు.

తాను వచ్చేందుకు డిస్టర్బ్ అవుతుందేమో అని అడిగితే గురుదేవ్ ఏమీ సమస్య లేదన్నారని చెప్పారు. వేల మంది భక్తులు, ముఖ్యంగా తమిళ భక్తులు తనను చుట్టుముట్టి ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు అడగుతారేమో అని భయపడినా ఎవరూ పట్టించుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరి దృష్టి గురుదేవుల మీద మాత్రమే ఉందన్నారు.

తన జీవితంలో ఎంతో మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలను చూశానని, కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ లేదని రజనీకాంత్ తెలిపారు. ఈ సంఘటన తన గర్వాన్ని (ఈగో) పూర్తిగా అణచివేసిందని, సెలబ్రిటీ హోదా తాత్కాలికమని, ఆధ్యాత్మిక హోదా మాత్రమే అత్యున్నతమని అర్థమైందని చెప్పారు.

Tags: