ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ!

Update: 2025-06-18 07:52 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరింత వేగవంతమైన అభివృద్దికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి కోరారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న నారాలోకేష్‌ ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాదించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి లోకేష్‌ వివరించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా, రూ.64వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తిచేస్తామని లోకేష్ చెప్పారు. ఈనెల 21వతేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఎపి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు.

Tags:    

Similar News