National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం: చీరాలలో సీఎం చంద్రబాబు.. నేతన్నలకు రూ.179 కోట్ల సాయం
నేతన్నలకు రూ.179 కోట్ల సాయం
National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించే కళ చేనేత కళ అని, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కళలకు నిలయమని సీఎం అన్నారు. మన నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేశారని గుర్తు చేశారు.
ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, చీరాలను మినీ ముంబయి అని పిలిచేవారని సీఎం వివరించారు. రాష్ట్రంలో 1.27 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని చెప్పుకొచ్చారు.
సబ్సిడీపై చేనేతలకు విద్యుత్ అందిస్తామన్న మాట నిలబెట్టుకున్నామని, చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంజీవని పేరుతో రూ.2.50 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది లేని పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉందని, తప్పకుండా ఆ రుణం తీర్చుకుంటామని చెప్పారు. రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు.
ఇదే సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా 71,536 చేనేత కుటుంబాలకు సాయం అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.179 కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ సాయం అందిస్తున్నామని చెప్పారు. అంతా చేతులు కలుపుదాం.. చేనేత కళను కాపాడుదామని సీఎం పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.