Minister Nara Lokesh: కష్టపడే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు: మంత్రి నారా లోకేశ్‌

మంత్రి నారా లోకేశ్‌

Update: 2026-06-26 18:00 GMT

Minister Nara Lokesh: కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఉపాధ్యాయులను నాయకులుగా భావిస్తోందని, విద్యా వ్యవస్థలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు.

ఇటీవల సింగపూర్‌ పర్యటనలో పాల్గొన్న 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్‌ ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. సింగపూర్‌లో తెలుసుకున్న విషయాలు, వాటిని రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్న అవకాశాల గురించి ఉపాధ్యాయులు మంత్రికి వివరంగా తెలిపారు.

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. 75 ఏళ్ల సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఇటీవల సింగపూర్‌ వెళ్లి అక్కడి ప్రధాని, ఇతర మంత్రులతో సమావేశమై కొత్త విషయాలపై అధ్యయనం చేశారని చెప్పారు.

"ఇకపై మనం ఇతర రాష్ట్రాలతో కాకుండా, ఇతర దేశాలతో పోటీ పడాలి" అని లోకేశ్‌ పిలుపునిచ్చారు. బదిలీలు, పదోన్నతులు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా అమలు చేస్తున్నామని వివరించారు. అభ్యసన ఫలితాలు, విశ్లేషణాత్మక ఆలోచన (ఎనలిటికల్‌ థింకింగ్‌)పై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు.

విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా 'ఛేంజ్‌ మేకర్స్‌'గా మారి, సింగపూర్‌లో నేర్చుకున్న అంశాలను రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేసేందుకు నాయకత్వం వహించాలని మంత్రి లోకేశ్‌ ఆకాంక్షించారు.

Tags:    

Similar News