Pawan Kalyan Condemns: అమర్నాథ్ అవేం మాటలు.. అనితపై వ్యాఖ్యలను ఖండించిన పవన్ కల్యాణ్

ఖండించిన పవన్ కల్యాణ్

Update: 2026-06-16 11:32 GMT


Pawan Kalyan Condemns: హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్, మహిళల దుస్తులు, బొట్టు వంటి వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారిపోయారని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు కేవలం అనితను మాత్రమే కాకుండా, సాధారణ మహిళలందరినీ కించపరచినట్లు భావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వెలువడే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందని హెచ్చరించారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, కానీ అవి విధానపరంగా ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ విధానం నచ్చకపోతే దాని గురించే విమర్శించాలని, ఇళ్లలోని స్త్రీలను కించపరచే తీరును ఖండించాలని కూటమి నేతలకు సూచించారు. అవతలి పార్టీలాగా దిగజారిన భాష, అర్థరహిత వ్యాఖ్యలు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. పౌర సమాజం హర్షించే రీతిలోనే బలంగా బదులివ్వాలని కూటమి నేతలందరికీ సందేశం ఇచ్చారు.

Tags:    

Similar News