N. Chandrababu Naidu: వేట్లపాలెం బాణసంచా పేలుడు హృదయవిదారకం: సీఎం చంద్రబాబు

పేలుడు హృదయవిదారకం: సీఎం చంద్రబాబు

Update: 2026-03-05 10:13 GMT

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సాయం, వైకాపాకు ప్రజాసమస్యలపై ఆసక్తి లేదు: సీఎం విమర్శ

N. Chandrababu Naidu: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భయంకర పేలుడు ఘటన హృదయాన్ని కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో దురాశతో ప్రజల జీవితాలతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

శాసనసభలో బుధవారం ఈ అంశంపై ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ఇది హృదయవిదారక ఘటన. హృదయాన్ని కలచివేసింది. పోయినవారి ప్రాణాలు తిరిగి రావు. కానీ వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, వారి పిల్లల చదువుకు బాధ్యత తీసుకుంటామని, ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, సీనియర్ అధికారులతో విచారణకు ఆదేశాలు జారీ చేశామని సీఎం వివరించారు. ఈ కర్మాగారానికి వైకాపా హయాంలోనే అనుమతి ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు.

అదే సమయంలో ప్రతిపక్ష వైకాపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది కానీ, ఇలాంటి ప్రజాసమస్యలు వాళ్లకు పట్టవు. వారి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, మండలిలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. దీన్ని వదిలేసి తిరుపతి లడ్డూపై రాజకీయం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే స్థితిలో వారు లేరు’’ అని సీఎం ధ్వజమెత్తారు.

మృతుల సంఖ్య 26కు చేరింది

సామర్లకోట గ్రామీణం నుంచి వచ్చిన వివరాల ప్రకారం, గత నెల 28న జరిగిన పేలుడులో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఆ తర్వాత వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు. బుధవారం సామర్లకోట కుమ్మరవీధికి చెందిన పల్లపాటి వీరశ్రీను (48), కాతేటి శ్రీను (33), వేట్లపాలెం కొత్తపేట చిటిక లక్ష్మి (45) మృతి చెందడంతో మృతుల సంఖ్య 26కు చేరింది.

ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాధితులకు కొంత ఊరట కలిగిస్తాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News