YSR Congress Party (YCP) President Y.S. Jaganmohan Reddy: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా నా గొంతు అణచివేయాలనే ఉద్దేశం

నా గొంతు అణచివేయాలనే ఉద్దేశం

Update: 2026-02-13 04:40 GMT

YSR Congress Party (YCP) President Y.S. Jaganmohan Reddy: అసెంబ్లీలో తన గొంతును అణచివేయడానికే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని గుర్తించడం లేదని ఆయన అన్నారు.

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా మాట్లాడే అవకాశం రాకుండా చేయడానికే ఉద్దేశపూర్వకంగా తనకు ప్రతిపక్ష నేత హోదా నిరాకరించారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించలేదని విమర్శించారు.

వైసీపీ బలం తక్కువగా ఉందని, పార్టీ గొంతు వినిపించకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడంతోనే మీడియాతో బయట మాట్లాడుతున్నామని వివరించారు. శాసనమండలిలో బలం ఉన్నందున అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, ఎమ్మెల్సీలు సభలో ధైర్యంగా మాట్లాడాలని సూచించారు.

కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, తమ ప్రభుత్వ హయాంలో అలాంటిది జరగలేదని, సీబీఐ చార్జ్‌షీట్‌లోనూ అదే ఉందని స్పష్టం చేశారు. సీబీఐ చార్జ్‌షీట్‌పై చంద్రబాబు సమాధానం చెప్పాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిపై దాడులు, కాకాణి గోవర్ధన రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని, ఇవన్నీ చంద్రబాబు చేయించినవేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయమని విమర్శించారు.

Tags:    

Similar News