Bajaj Auto : మాకు అవే కావాలి.. భారత బైక్‌లకు విదేశాల్లో ఫుల్ డిమాండ్

భారత బైక్‌లకు విదేశాల్లో ఫుల్ డిమాండ్

Update: 2025-09-01 12:51 GMT

Bajaj Auto : భారతీయ మార్కెట్‌లో ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో ఆగస్టు 2025లో తమ మొత్తం అమ్మకాలలో భారీ వృద్ధిని సాధించింది. గతేడాది ఆగస్టు 2024లో 3,97,804 యూనిట్లు విక్రయించగా, ఈసారి మొత్తం 4,17,616 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 5 శాతం ఎక్కువ. అలాగే జూలై 2025లో కంపెనీ 3,66,000 యూనిట్లు విక్రయించగా, ఆగస్టులో అమ్మకాలు బాగా పెరిగాయి.

దేశీయ మార్కెట్‌లో తగ్గిన అమ్మకాలు

మొత్తం అమ్మకాలు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్‌లో బజాజ్​కు నష్టం జరిగింది. ఆగస్టు 2025లో బజాజ్​ దేశీయ అమ్మకాలు 8 శాతం తగ్గి 2,32,398 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,53,827 యూనిట్లుగా ఉంది. టూ-వీలర్ విభాగంలో ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 12 శాతం తగ్గి 1,84,109 యూనిట్లకు చేరాయి.

ఎగుమతులే కీలకం

ఒకవైపు దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ, ఎగుమతులు కంపెనీకి పెద్ద బలం చేకూర్చాయి. ఆగస్టు 2025లో బజాజ్ ఆటో మొత్తం 1,85,218 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది ఆగస్టు 2024లో ఎగుమతి చేసిన 1,43,977 యూనిట్ల కంటే 29 శాతం ఎక్కువ. టూ-వీలర్ ఎగుమతులు కూడా 25 శాతం పెరిగి 1,57,778 యూనిట్లకు చేరాయి.

వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్) విభాగం కూడా ఆగస్టు 2025లో కంపెనీకి పెద్ద అండగా నిలిచింది. దేశీయ అమ్మకాలు 7 శాతం పెరిగి 48,289 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లో కూడా 58 శాతం పెరుగుదల కనిపించి, 27,440 యూనిట్లకు చేరాయి. మొత్తంగా, ఆగస్టు 2025లో బజాజ్ ఆటోకు దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ, విదేశీ మార్కెట్‌ల నుంచి వచ్చిన డిమాండ్ కంపెనీకి కొత్త బలాన్ని ఇచ్చింది.

ఏప్రిల్-ఆగస్టు 2025 ప్రదర్శన

2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) బజాజ్ ఆటో మొత్తం 18,94,853 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 18,54,029 యూనిట్ల కంటే 2 శాతం ఎక్కువ. దేశీయ అమ్మకాలు 9 శాతం తగ్గి 10,50,349 యూనిట్లకు చేరుకున్నప్పటికీ, ఎగుమతుల్లో 21 శాతం పెరుగుదల ఈ నష్టాన్ని భర్తీ చేసింది.

Tags:    

Similar News