Bajaj Pulsar N125 : టూ-వీలర్ మార్కెట్లో పెను సంచలనం.. పల్సర్ N125 ఉత్పత్తి నిలిచిపోనుందా?
పల్సర్ N125 ఉత్పత్తి నిలిచిపోనుందా?
Bajaj Pulsar N125 : బజాజ్ ఆటో నుంచి వచ్చిన పల్సర్ N125 బైక్‌కు సంబంధించి ఇప్పుడు మార్కెట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, కంపెనీ ఈ బైక్ సప్లైని డీలర్లకు నిలిపివేసింది. దీంతో ఈ బైక్ ఇక ఉత్పత్తి నిలిచిపోతుందా లేక ఏవైనా మార్పులతో కొత్త రూపంలో రాబోతుందా అన్నది చర్చనీయాంశమైంది. అయితే బజాజ్ సంస్థ నుండి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం ఈ బైక్ ఇంకా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తుండటంతో, అభిమానులు అయోమయంలో ఉన్నారు.
రెండు ఏళ్ల క్రితమే లాంచ్.. ఈ బైక్ ప్రత్యేకతలేంటి?
బజాజ్ పల్సర్ N125 అక్టోబర్ 2024లో యువతను ఆకట్టుకునే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.95,000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్పోర్టీ బైక్, స్టైలిష్ లుక్, మంచి పర్ఫార్మెన్స్‌తో చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది. ఇది 124.59cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 12 PS పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 125 కేజీల బరువు మాత్రమే ఉండటంతో సిటీ ట్రాఫిక్‌లో సులువుగా ప్రయాణించేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది. అంతేకాకుండా, 0 నుంచి 60 కిమీ వేగాన్ని అత్యంత వేగంగా అందుకోగల సామర్థ్యం దీనికి ఉంది.
కొత్త వెర్షన్ వచ్చే ఛాన్స్ ఉందా?
బజాజ్ ఆటో 2026 సంవత్సరంలో 8 కొత్త బైకులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సప్లై నిలిచిపోయిన ఈ N125 బైక్ స్థానంలో మరింత అప్‌డేటెడ్ ఫీచర్లతో కొత్త మోడల్ రావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. బజాజ్ కంపెనీకి 125cc సెగ్మెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కంపెనీ అమ్మకాల్లో దాదాపు 32 శాతం వాటా పల్సర్ 125 సిరీస్ (Pulsar 125, N125, NS125) నుంచే వస్తోంది. కాబట్టి, ఈ సెగ్మెంట్‌ను వదులుకునే ప్రసక్తే లేదని, బహుశా కంపెనీ దీనిని మరింత శక్తివంతంగా మార్చే ప్రక్రియలో ఉండవచ్చని అర్థమవుతోంది.
ఫీచర్ల విషయానికి వస్తే..
ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, మెసేజ్, కాల్ అలర్ట్స్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. స్పోర్టీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వంటివి ఈ బైక్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ప్రస్తుతం హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా CB125 హార్నెట్ వంటి బైకులకు పోటీగా నిలిచిన ఈ మోడల్, ఒకవేళ కొత్త రూపంతో తిరిగి వస్తే ఎలా ఉండబోతుందనేది చూడాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.