Bajaj Pulsar NS200: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన బజాజ్ పల్సర్ NS సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మార్కెట్లో అధికారికంగా లాంచ్ కావడానికి ముందే పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్400జె అప్‌డేటెడ్ వేరియంట్లు దేశంలోని వివిధ డీలర్‌షిప్‌లకు చేరుకున్నాయి. ఈ రెండు బైక్‌లలో కంపెనీ సరికొత్త 5-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించనుంది. దీనివల్ల ఈ మోడళ్లలో ఫీచర్లు పూర్తిగా మారిపోనున్నాయి.

5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో స్మార్ట్ ఫీచర్లు

కొత్త పల్సర్ బైక్‌లలో రాబోతున్న ప్రధాన మార్పు వాటి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లోనే ఉండనుంది. ఇందులో బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీతో కూడిన 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు. దీన్ని బజాజ్ వారి అధికారిక స్మార్ట్‌ఫోన్ యాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డిస్‌ప్లేపై నేరుగా గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ సమాచారాన్ని వీక్షించవచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు స్క్రీన్ లాక్ అయి ఉన్నప్పటికీ నేవిగేషన్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అలాగే మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్స్, థర్డ్-పార్టీ యాప్ నోటిఫికేషన్లు కూడా పొందవచ్చు.

డిజిటల్ డాక్యుమెంట్లు, ఎన్ఎస్200 హార్డ్‌వేర్ అప్‌డేట్

ఈ కొత్త టీఎఫ్‌టీ సిస్టమ్‌లో రైడర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకునే సదుపాయం కల్పించారు. ఈ డిస్‌ప్లేను సులభంగా కంట్రోల్ చేయడానికి స్విచ్ గేర్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇక పల్సర్ ఎన్ఎస్200 మోడల్‌లో కేవలం స్క్రీన్ మాత్రమే కాకుండా హార్డ్‌వేర్ పరంగానూ అప్‌డేట్లు ఉన్నాయి. ఇందులో WP అపెక్స్ USD ఫ్రంట్ ఫోర్క్స్ అందించే అవకాశం ఉండటంతో సస్పెన్షన్ మరింత ప్రీమియంగా మారనుంది. టైర్లు, బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఎన్ఎస్400జె ఇంజిన్, లాంచ్ వివరాలు

పెద్ద మోడల్ అయిన పల్సర్ ఎన్ఎస్400జె లో పెద్దగా మెకానికల్ మార్పులు ఉండే అవకాశం లేదు. ఇందులో ఇప్పటికే ఉన్న 349.13 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. ఈ ఇంజిన్ 40.6 bhp పవర్, 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే దీనిలో ప్రధాన ఫోకస్ అంతా టెక్నాలజీ, డిస్‌ప్లే అప్‌డేట్‌పైనే ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో రానున్న పండుగ సీజన్‌కు ముందే బజాజ్ ఆటో ఈ బైక్‌ల అధికారిక ధరలు, లాంచ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

Tags: