Electric Scooters : మిడిల్ క్లాస్‌కు బంపర్ ఆఫర్.. రూ.67,998 ప్రారంభ ధరలోనే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
Electric Scooters : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. రోజువారీ పెట్రోల్ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో, మధ్యతరగతి కొనుగోలుదారులు ఇప్పుడు చౌకగా, తక్కువ నిర్వహణ ఖర్చులతో నడిచే ఈవీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల బడ్జెట్ అంచనాలకు తగ్గట్లుగా 2026 మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్, స్మార్ట్ ఫీచర్లు, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు రూ. 67,998 నుండి ప్రారంభమవుతున్నాయి.
లెక్ట్రిక్స్ ఎస్ఎక్స్25
మీరు చాలా తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే లెక్ట్రిక్స్ ఎస్ఎక్స్25 ఒక అద్భుతమైన ఆప్షన్ కాగలదు. మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.67,998 గా ఉంది. ఆఫీసులకు, కాలేజీలకు లేదా మార్కెట్లకు ప్రతిరోజూ చిన్నపాటి ప్రయాణాలు చేసే వారికి ఈ స్కూటర్ చాలా అనువుగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది ఒక చక్కటి పొదుపు మార్గం అని చెప్పొచ్చు.
ఓలా ఎస్1 ఎక్స్
ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఓలా ఎస్1 ఎక్స్ ఒకటిగా నిలిచింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర దాదాపు రూ. 84,999 గా ఉంది. ఇందులో వేర్వేరు బ్యాటరీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 108 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 242 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుంది. మోడరన్ డిజైన్, డిజిటల్ డిస్ప్లే, అధునాతన స్మార్ట్ ఫీచర్లు దీని సొంతం.
టీవీఎస్ ఐక్యూబ్
నమ్మకమైన బ్రాండ్ వాల్యూ, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్‌ను కోరుకునే వారికి టీవీఎస్ ఐక్యూబ్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ స్కూటర్ ప్రారంభ ధర దాదాపు రూ. 1.20 లక్షలుగా ఉంది. టీవీఎస్ కంపెనీకి చిన్న చిన్న నగరాలు, గ్రామాల్లో కూడా బలమైన డీలర్ నెట్‌వర్క్ ఉండటం వల్ల కొనుగోలుదారులకు సర్వీసింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ స్కూటర్ ఇచ్చే స్మూత్ రైడింగ్ క్వాలిటీ, కంఫర్ట్ సీటింగ్ దీనిని రోజువారీ వాడకానికి మరింత అనుకూలంగా మారుస్తాయి.
బజాజ్ చేతక్
ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్ బజాజ్ చేతక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో దుమ్మురేపుతోంది. ఈ స్కూటర్ తన ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, గట్టి మెటల్ బాడీ డిజైన్‌కు చాలా ఫేమస్. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది దాదాపు 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ప్లాస్టిక్ బాడీ కాకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా రగ్గడ్ లుక్ కోరుకునే కస్టమర్లకు బజాజ్ చేతక్ అత్యంత సురక్షితమైన ఎంపిక.
హీరో విడా విఎక్స్2
హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి వచ్చిన హీరో విడా విఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 79,490 గా ఉంది. ఈ స్కూటర్ లో ఉన్న అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే.. దీనికి స్వ్యాపబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. అంటే బ్యాటరీని స్కూటర్ నుంచి విడదీసి బయటకు తీయవచ్చు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి లేదా ఇళ్ల వద్ద సొంతంగా చార్జింగ్ పెట్టుకునే సదుపాయం లేని వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది. బ్యాటరీని సులభంగా లోపలికి తీసుకెళ్లి చార్జ్ చేసుకోవచ్చు లేదా బ్యాటరీ స్టేషన్లలో ఇచ్చి మార్చుకోవచ్చు.