Car Driving Tips : ట్రాఫిక్ జామ్‌లో క్లచ్ ఎక్కువగా నొక్కుతున్నారా? త్వరలోనే మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం
మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం
Car Driving Tips : ప్రస్తుతం మనదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ జామ్ అనేది నిత్యకృత్యంగా మారింది. ఆఫీస్ వేళల్లోనైతే గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతుంటాయి. ఇలాంటి భారీ ట్రాఫిక్ జామ్‌లలో చాలా నెమ్మదిగా కార్ నడపడం వల్ల డ్రైవర్లకు విసుగు రావడమే కాకుండా, కారులోని కొన్ని ముఖ్యమైన భాగాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా మాన్యువల్ కార్లలో ఎక్కువగా ఉపయోగించే క్లచ్ వ్యవస్థపై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ చిక్కుల్లో పడినప్పుడు చాలా మంది డ్రైవర్లు తెలియకుండానే క్లచ్‌ను తప్పుడు పద్ధతిలో వాడుతుంటారు. ఈ చిన్నపాటి తప్పుల వల్ల క్లచ్ ప్లేట్లు చాలా త్వరగా అరిగిపోయి, భారీగా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. కొన్ని చిన్న చిన్న డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా క్లచ్ జీవితకాలాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
హాఫ్ క్లచ్ డ్రైవింగ్‌తోనే అసలు ముప్పు
ట్రాఫిక్ జామ్‌లో చాలా మంది చేసే మొదటి తప్పు.. నిరంతరం క్లచ్ పెడల్‌పై కాలును నొక్కి ఉంచడం లేదా సగం మాత్రమే క్లచ్ వదలడం. ఆటోమొబైల్ భాషలో దీనినే హాఫ్ క్లచ్ అంటారు. ఈ స్థితిలో ఇంజిన్ నుండి వచ్చే పవర్, చక్రాలకు వెళ్లే క్రమంలో క్లచ్ ప్లేట్, ఫ్లైవీల్ మధ్య విపరీతమైన ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కారణంగా క్లచ్ బాక్స్‌లో విపరీతమైన వేడి పుడుతుంది. ఎక్కువసేపు ఇలాగే డ్రైవ్ చేయడం వల్ల క్లచ్ ప్లేట్లు చాలా వేగంగా అరిగిపోవడమే కాకుండా, ఒక్కోసారి కాలిపోయి కారులో నుంచి ఒక రకమైన చెడు వాసన రావడం మొదలవుతుంది. అందుకే గేరు మార్చిన వెంటనే కాలును క్లచ్ పెడల్ నుంచి పూర్తిగా తీసేసి, పక్కనే ఉండే ఫుట్‌రెస్ట్ లేదా డెడ్ పెడల్‌పై ఉంచడం అలవాటు చేసుకోవాలి.
సిగ్నల్ పడగానే గియర్‌లోనే ఉంచుతున్నారా?
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా జామ్‌లో కారు కొన్ని నిమిషాల పాటు పూర్తిగా ఆగిపోయినప్పుడు, చాలా మంది డ్రైవర్లు ఫస్ట్ గేర్‌లోనే ఉంచి క్లచ్‌ను పూర్తిగా నొక్కి పట్టుకుని ఎదురుచూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కారులోని క్లచ్ రిలీజ్ బేరింగ్‌పై అదనపు మెకానికల్ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కాలక్రమేణా బేరింగ్ దెబ్బతిని క్లచ్ నొక్కేటప్పుడు వింత శబ్దాలు వస్తాయి. ఇటువంటి సమస్య రాకుండా ఉండాలంటే.. కారు కొన్ని సెకన్ల కంటే ఎక్కువసేపు ఆగిపోతుందని అనుకున్నప్పుడు వెంటనే గేరును న్యూట్రల్ లోకి మార్చాలి. ఆ తర్వాత క్లచ్ పెడల్ నుండి కాలును పూర్తిగా ఫ్రీగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల క్లచ్ సిస్టమ్ రిలాక్స్ అయ్యి, అనవసరమైన లోడ్ పడకుండా ఉంటుంది.
ఫ్లైఓవర్లపై కార్ వెనక్కి పోకుండా క్లచ్‌తో ఆపుతున్నారా?
ఫ్లైఓవర్లపై లేదా కొండ ప్రాంతాల వంటి ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినప్పుడు డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టమైన పని. కారు వెనక్కి దొర్లిపోకుండా చూసుకోవడానికి చాలా మంది డ్రైవర్లు క్లచ్, యాక్సిలేటర్‌ను సగం సగం నొక్కి పట్టుకుని కారును ఒకే చోట బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ టెక్నిక్ వల్ల కారు వెనక్కి వెళ్లకుండా తాత్కాలికంగా ఆగుతుంది కానీ, క్లచ్ ప్లేట్లు మాత్రం తీవ్రంగా దెబ్బతింటాయి. ఎత్తు పల్లాల రోడ్లపై కారును ఆపాల్సి వస్తే.. క్లచ్‌తో కాకుండా నార్మల్ బ్రేక్ లేదా హ్యాండ్ బ్రేక్ సహాయం తీసుకోవాలి. మళ్లీ ముందు ఉన్న వాహనాలు కదిలినప్పుడు, మెల్లగా క్లచ్ వదులుతూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే కారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది.
హ్యాండ్ బ్రేక్ వాడకం.. లాంగ్ లైఫ్ క్లచ్
ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్లపై కూడా క్లచ్‌ను ఎక్స్‌లరేటర్ లాగా వాడటం వల్ల మైలేజ్ కూడా దారుణంగా పడిపోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన అవగాహన కలిగి ఉంటే వేలాది రూపాయల రిపేరింగ్ ఖర్చులను సులభంగా ఆదా చేసుకోవచ్చు. కారు సర్వీసింగ్‌కు వెళ్లినప్పుడు కూడా క్లచ్ ఫ్లూయిడ్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా సరైన గేరును ఎంచుకోవడం, అనవసరంగా క్లచ్‌పై కాలు వేసి ఉంచే అలవాటును మానుకోవడం వల్ల కార్ లైఫ్ పెరుగుతుంది. ఈ సింపుల్ స్మార్ట్ డ్రైవింగ్ రూల్స్ పాటిస్తే మీ జర్నీ హ్యాపీగా సాగడమే కాకుండా, మీ కారు ఎల్లప్పుడూ బెస్ట్ కండిషన్‌లో ఉంటుంది.