Car Mileage Tips : కార్ స్పీడ్‌కు, మైలేజ్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ సీక్రెట్ తెలిస్తే రూ.వేల పెట్రోల్ ఆదా ఖాయం

రూ.వేల పెట్రోల్ ఆదా ఖాయం

Update: 2026-07-17 06:20 GMT

Car Mileage Tips : ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో కారు ఉన్న ప్రతి ఒక్కరూ ఆశించేది ఒక్కటే.. మంచి మైలేజ్ రావాలని. అయితే చాలా మంది కారు ఇంజన్ బాగుంటేనే మైలేజ్ వస్తుందని భ్రమిస్తుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే.. కారు ఇంజన్ ఎంత ముఖ్యమో.. మనం కారును డ్రైవ్ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. సరైన పద్ధతిలో, నియంత్రిత వేగంతో కారును నడిపితే ఇంధనం భారీగా ఆదా అవ్వడమే కాకుండా తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ మైలేజ్ గేమ్ లో కారు స్పీడ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.

హైవేలపై దూసుకుపోతున్నారా?

మీరు తరచూ హైవేలు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణిస్తుంటారా? అయితే ఖాళీ రోడ్డు కనిపించగానే కారును ఇష్టమొచ్చినట్లు రేస్ చేయడం అస్సలు మంచిది కాదు. కారును ఒకే సమానమైన వేగంతో నడపడం వల్ల అద్భుతమైన మైలేజ్ వస్తుందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. హైవేలపై కారును గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో నడిపినప్పుడు దాదాపు అన్ని కార్లు తమ బెస్ట్ మైలేజ్‌ను ఇస్తాయి. ఈ స్పీడ్ వద్ద ఇంజన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా కూల్‌గా పని చేస్తుంది. పైగా కారు టాప్ గేర్‌లో రన్ అవుతుంది కాబట్టి ఇంధనం చాలా తక్కువగా ఖర్చవుతుంది. పదే పదే యాక్సిలరేటర్ నొక్కడం, బ్రేకులు వేయడం లాంటివి హైవేలపై తగ్గించాలి.

సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్ ముఖ్యం

నగరాల్లోని రోడ్లపై ప్రయాణించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా పదే పదే బ్రేకులు వేయడం, గేర్లు మార్చడం తప్పనిసరి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కారు వేగాన్ని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఉంచుకోవడం అత్యంత ఉత్తమం. ట్రాఫిక్ లో అనవసరంగా కారును వేగంగా దూకించడం లేదా సడన్ బ్రేకులు వేయడం వంటివి చేయకూడదు. చాలా స్మూత్‌గా డ్రైవ్ చేయడం వల్ల ఇంజన్‌పై లోడ్ పడదు, తద్వారా సిటీ పరిధిలో కూడా కారు ఆశించిన స్థాయి కంటే మెరుగైన మైలేజ్‌ను అందిస్తుంది.

అతి వేగం ఎందుకు మైలేజ్‌ను గుంజేస్తుంది?

చాలా మంది రోడ్డు ఖాళీగా ఉందనిపిస్తే చాలు కారును 100 లేదా 120 కిలోమీటర్ల వేగంతో తొక్కుతుంటారు. కానీ కారు వేగం పెరిగే కొద్దీ దానికి ఎదురయ్యే గాలి ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. వేగంగా దూసుకుపోయే కారును గాలి వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ గాలి అడ్డంకిని దాటుకుని కారు ముందుకు వెళ్లాలంటే ఇంజన్ తన శక్తినంతటినీ ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల కారు ఎక్కువ పెట్రోల్‌ను లాగేస్తుంది.

90 కిలోమీటర్ల వేగం దాటితే అంతే సంగతులు

ఆటోమొబైల్ నిపుణుల లెక్కల ప్రకారం.. కారు వేగం గంటకు 90 కిలోమీటర్లు దాటినప్పటి నుంచి మైలేజ్ క్రమంగా పడిపోవడం మొదలవుతుంది. మీరు గనుక కారును 110 నుంచి 120 కిలోమీటర్ల హై స్పీడ్ తో నడిపితే, సాధారణం కంటే ఇంధన వినియోగం ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు పెరిగిపోతుంది. అంటే మీరు ఎంత వేగంగా వెళ్తే మీ జేబుకు అంత పెద్ద చిల్లు పడుతుందన్నమాట. కాబట్టి ప్రయాణ సమయం కొద్ది నిమిషాలు ఆదా అవుతుందేమో కానీ, పెట్రోల్ బిల్లు మాత్రం భారీగా పెరుగుతుంది.

కార్ మైలేజ్ పెంచుకోవడానికి ఇస్రో తరహా సింపుల్ చిట్కాలు

కారు మైలేజ్ పెరగడానికి స్పీడ్ తో పాటు మరికొన్ని చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సరైన సమయానికి సర్వీసింగ్ చేయించాలి. ముఖ్యంగా టెన్షన్ లేకుండా ప్రయాణించాలంటే టైర్లలో ఎయిర్ ప్రెజర్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. కారులో అనవసరమైన బరువులను వేసుకుని తిరగకూడదు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు లేదా కారును ఎక్కడైనా ఎక్కువ సమయం ఆపినప్పుడు ఇంజన్‌ను ఆన్ లో ఉంచకుండా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పెట్రోల్ డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా కారు ఇంజన్ లైఫ్ కూడా చాలా కాలం మన్నుతుంది.

Tags:    

Similar News