Cyber Security : ఇక కార్లకు కూడా సైబర్ సెక్యూరిటీ కాపలా.. వాహనాల హ్యాకింగ్‌కు అడ్డుకట్ట వేసేలా కేంద్రం సరికొత్త రూల్స్
కేంద్రం సరికొత్త రూల్స్
Cyber Security : ప్రస్తుత కాలంలో భారతదేశంలో కార్లు మునుపటి కంటే చాలా స్మార్ట్‌గా మారుతున్నాయి. కొత్తగా వస్తున్న వాహనాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ ఫీచర్లు, మొబైల్ తరహా సాఫ్ట్‌వేర్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కార్లు ఎంత స్మార్ట్‌గా మారుతున్నాయో, అంతే స్థాయిలో వాటిపై సైబర్ దాడులు జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. హ్యాకర్లు కారు సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడం లేదా వైరస్లు పంపించి కారు నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకునే ముప్పు పెరుగుతోంది. ఈ తీవ్రమైన సవాలును గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త రూల్స్ కనీసం ఒక ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్ (ECU) కలిగి ఉండి, లెవెల్-3 లేదా అంతకంటే ఎక్కువ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సామర్థ్యం ఉన్న అన్ని ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు , ట్రాక్టర్లకు వర్తిస్తాయి. ఈసీయూ అనేది కారులోని ఇంజన్, బ్రేకులు, బ్యాటరీ వంటి అత్యంత కీలకమైన భాగాలను నియంత్రించే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం, అక్టోబర్ 2026 నుంచి మార్కెట్లోకి వచ్చే మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, ఆడి ఏ8, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ వంటి అధునాతన లెవెల్-3 ఆటోమేషన్ కలిగిన కొత్త కార్లకు ఈ సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటించడం పూర్తిగా తప్పనిసరి కానుంది. అలాగే ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పాత మోడళ్లకు ఏప్రిల్ 2027 నుంచి ఈ నియమాలు వర్తిస్తాయి.
ఈ లగ్జరీ కార్ల తర్వాత, ప్రభుత్వం దశలవారీగా ఇతర సాధారణ వాహనాలకు కూడా ఈ నిబంధనలను విస్తరించనుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2028 మధ్య కాలంలో ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సౌకర్యం ఉన్న అన్ని వాహనాలకు ఈ సైబర్ రూల్స్ వర్తింపజేస్తారు. ఆ తదుపరి విడతలో, అంటే అక్టోబర్ 2029 నాటికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకునే వీలున్న ప్రతి ఒక్క చిన్న, పెద్ద వాహనానికీ ఈ భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అవుతాయి. ఓటీఏ అప్‌డేట్ అంటే మన మొబైల్ ఫోన్ లాగే కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లే పని లేకుండా ఇంటర్నెట్ లేదా వై-ఫై ద్వారా నేరుగా కంపెనీ నుండే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం. ఈ ఫీచర్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు కారులోకి చొరబడేందుకు అంతే అవకాశం ఇస్తుంది. అందుకే డిజిటల్ యుగంలో ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.