EV Subsidies : ఢిల్లీ రవాణా శాఖ సంచలన నిర్ణయం.. 22 వేలకు పైగా ఈవీ సబ్సిడీ క్లెయిమ్‌ల పరిష్కారం

22 వేలకు పైగా ఈవీ సబ్సిడీ క్లెయిమ్‌ల పరిష్కారం

Update: 2026-03-19 09:07 GMT

EV Subsidies : ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గతంలో ప్రకటించిన సబ్సిడీలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ చొరవతో సుమారు 22,733 పెండింగ్ క్లెయిమ్‌లను పరిశీలించి, అర్హులైన వారికి నిధులు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా కంపెనీలు, సంస్థలకు చెందిన 3,948 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.7.95 కోట్ల సబ్సిడీని పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తాము ఇప్పుడు దాన్ని సరిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి

సబ్సిడీ పంపిణీలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనికోసం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు. సుమారు 12,877 మంది వ్యక్తిగత లబ్ధిదారుల ఆధార్ సీడింగ్ పూర్తయిందని, వారికి రూ.24.04 కోట్ల సబ్సిడీ అందనుందని అధికారులు తెలిపారు. మిగిలిన 4,015 మంది లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది.

అప్‌గ్రేడ్ అవుతున్న ఈవీ పోర్టల్

సబ్సిడీ అప్లికేషన్లు, వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఢిల్లీ ఈవీ ఇన్సెంటివ్ పోర్టల్‌‎ను ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఈ నూతన పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు. కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తే, వాహనం కొన్న వెంటనే సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవడం, దాని స్థితిని ట్రాక్ చేయడం చాలా సులభం అవుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో సబ్సిడీ అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

పర్యావరణ హితమే లక్ష్యం

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సబ్సిడీలతో పాటు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా మెరుగుపరుస్తోంది. 2030 నాటికి ఢిల్లీని ఈవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సబ్సిడీల విడుదల వల్ల సామాన్యులకు ఈవీలు కొనుగోలు చేయడం మరింత భారం తగ్గనుంది.

Tags:    

Similar News